పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0020-4 ముఖారి సం: 05-111

పల్లవి:

ఆఁపలేక నిను దూరేనంతె గాక
యేఁపుచుఁ గూడేటి పొందులేలయ్య విభుఁడా

చ. 1:

కోపగించుకొన్నచోట కూరిమితో వినయమే
చూపిన నామాట నీకు సొగసీనటే
యేపు రేఁగి నీకుఁ బ్రియమెక్కడనో వుండఁగాను
తాపమయ్యే పొందు నీకుఁ దగదయ్య విభుఁడా

చ. 2:

నేరములెన్నఁగ నేను నిజములు పలికిన
వైరములే యౌఁగాక వలపౌనటే
యీరుదీయఁ బేను వచ్చీనిఁకనేల మాటలు నీ-
వారము మమ్మిఁకఁ దడవకుమయ్య విభుఁడా

చ. 3:

ననిచి కూడినవారు నమ్మక ప్రియునిమీఁద
కనలి యాడినమాట కసరౌనటే
ఘనుఁడవు తిరువేంకటరాయ మనలోని-
కినుకలన్నియు నిట్టె గెలుపయ్య విభుఁడా