పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0020-3 శ్రీరాగం సం: 05-110

పల్లవి:

అంతరంతకు గాలినణఁగునా యనలంబు
కాంత నిట్టూర్పులాఁకలి చెరిచెఁగాక

చ. 1:

కలువలూరక నీటఁ గందునా యెందైనఁ
జెలియకన్నీరిట్లఁ జేసెఁ గాక
జలజంబుపై వేఁడి చల్లునా రవి యిట్ల
నలఁచి మదనాగ్ని వదనము నొంచెఁగాక

చ. 2:

విరులకునుఁ దుమ్మిదలు వెరచునా యెందైన
మరుబాణముల నెరులు మలఁగెఁగాక
సరుస మంచునఁ దీగె వాడునా యెందైన
అరిది చెమటలనె దేహము నొగిలెఁ గాక

చ. 3:

కుముదహితుఁడెందైనఁ గూడునా జక్కవల
కొమరె గుబ్బలమీఁదఁ గూడెఁ గాక
తిమిరంబు తిమిరమునఁ దెమలునా యెందైన
రమణి వేంకటవిభుని రతిమఱపుగాక