పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0020-2 నారణి సం: 05-109

పల్లవి:

ఏమి సేయఁగవచ్చు నేకాలమేత్రోవ
ఆమీఁది దైవగతులటుగాక పోదు

చ. 1:

కనుమాయ నెన్నడిమికరవుననె లలితాంగి
పనువుచునుఁ గుచగిరుల పాలాయను
కనలి లోలోని దొంగలచేతఁ బోటుపడి
వొనరఁ గట్టనచీరయును శిథిలమాయ

చ. 2:

పెడమరలి నునుఁదురుము పెదచీఁకటినె చెలియ
బడలి వదనము వంచఁ బాలాయను
వెడఁదకన్నుల చూపువేడుకల వగలెల్ల-
దడవి హితవైన చిత్తంబు నెరవాయ

చ. 3:

అరుదైన పరవశంబను అడవిలోఁ దగిలి
పరిమళపుఁ జెమట నది పాలాయను
యిరవైన తిరువేంకటేశు కౌఁగిటఁ గూడి
కురులు సవరించ సిగ్గులునుఁ బగలాయ