పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0018-6 పాడి సం: 05-107

పల్లవి:

చక్కని తల్లికి చాఁగుబళా తన-
చక్కెరమోవికి చాఁగుబళా

చ. 1:

కులికేటి మురిపెపు గుమ్మరింపుఁ దన-
సళుపుఁ జూపులకు చాఁగుబళా
పలుకుల సొలపులఁ బతితోఁ గసరెడి-
చలముల యలుకకు చాఁగుబళా

చ. 2:

కిన్నెరతోఁ బతి కెలన నిలుచుఁ దన-
చన్ను మెఱుఁగులకు చాఁగుబళా
ఉన్నతిఁ బతిపైనొరగి నిలుచుఁ దన-
సన్నపు నడిమికి చాఁగుబళా

చ. 3:

జందెపు ముత్యపు సరులహారముల -
చందనగంధికి చాఁగుబళా
విందయి వేంకటవిభుఁ బెనఁచిన తన-
సందిదండలకు చాఁగుబళా