పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0018-4 లలిత సం: 05-105

పల్లవి:

నిక్కమటే యీ మాట నిజమనేవు
నిక్కముగాక బొంకనేర్తుమా బాలుఁడా

చ. 1:

కంటివటే వెన్న దియ్యఁగా గొల్లెతా ని-
న్నంటిమా మా వెన్న వోయనంటిమి గాక
ఇంటికి నే వచ్చితినటే గొల్లెతా మా-
యింటికిఁక నీకు రానేలయ్య బాలుఁడా

చ. 2:

ఏలే మాకుఁ బాలు లేవటే గొల్లెతా నీకు-
నేలలేవు మమ్మునిట్టె యేఁచేవు గాక
పాల నేఁబండుట దలంపవే గొల్లెతా ఆ-
పాలు నీకునేల మా పాలేకాక బాలుఁడా

చ. 3:

కల్లలాడ దొరకొంటిగా గొల్లెతా యేల
పల్లదాలు వేంకటాదిపై బాలుఁడా
చెల్లఁబో నన్నొల్లవటే చిన్ని గొల్లెతా నీకుఁ
జెల్లునిట్టె యేమైనఁ జేయవయ్య బాలుఁడా