పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0018-1 మంగళకౌశిక సం: 05-102

పల్లవి:

నేనేలెవ్వరునేల నీకింక లో-
లోనె వలపు లోఁచీఁ బోవయ్యా

చ. 1:

కలువరేకులు నీకుఁ గానుక యిచ్చినదట
చెలఁగి నీవెందో విచ్చేయఁగాను
అలమి కన్నులనె నీ వందుకొంటివని యాకె
పిలిచీనంటాఁ బిలిచేరు పోవయ్యా

చ. 2:

చిగురుఁదేనెలు నీఫై చిలకించినదట
నగవు నీ వెందో నగఁగాను
జిగిగా నీ వపుడే చేకొంటివంటా నాపె
నొగిలీనంటా నొగిలేరు పోవయ్యా

చ. 3:

మోవిపండు నీకు మోవినిచ్చినదఁట
మావికింద నీవు మలయఁగాను
శ్రీవేంకటేశ యిచ్చితివి కౌఁగిలి నాకు
నీ వెందు వలచినా నేనే పోవయ్యా