పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0017-6 శ్రీరాగం సం: 05-101

పల్లవి:

సామాన్యమా వలపు సతులుఁ బతులనుభవన -
లేమరినఁ బ్రాణంబులేరీతి నుండు

చ. 1:

కలికి చూపుల మనసు గరఁగ కెటువలె నుండు
అలయింతలను దేహమలయకేలుండు
బులుపుఁ బిలుపుల మేను పులకించకేలుండు
మొలకనగవుల యాస మొలవకేలుండు

చ. 2:

పచ్చిచూపులు కాఁడి పారకెటువలెనుండు
వెచ్చనూర్పులు మనసు వేఁచకేలుండు
మచ్చికల హృదయంబు మరులు గొనకేలుండు
అచ్చలంబునఁ గాఁకలలమకేలుండు

చ. 3:

దంటమాటలఁ గూర్మి దగుల కెటువలెనుండు
నంటునను మోహంబు నాఁటకేలుండు
గొంటుఁజేఁతల మనసు కొల్లగొనకేలుండు
రెంటలను విరహగ్ని రేఁచకేలుండు

చ. 4:


కింకలను దమకంబు కెరలకెటువలె నుండు
జంకెనలఁ బ్రేమ కొనసాఁగకేలుండు
వేంకటవిభుఁనిఁ గలసి వెడయలుక యేలుండు
పంకజానన వానిఁ బాసియేలుండు