పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0017-5 పాడి సం: 05-100

పల్లవి:

ఏఁటికిఁ జేరీనేమితఁడు
నాఁటించి రతి నన్నేలె

చ. 1:

కన్నుల మొక్కీఁ గానుకలంపీ -
నెన్నటికెన్నఁడిదేమితఁడు
నిన్నట నుండియు నెయ్యమె పెంచీ
నన్నేలీతఁడు నవ్వీనే

చ. 2:

పువ్వుల వేసీఁ బొంచుక లాసీ-
నెవ్వరికెవ్వరిదేమితఁడు
దవ్వుల నున్నాఁ దాపము రేఁచీ
రవ్వలనే కడు రాసీనే

చ. 3:

కంపులె పూసీఁ గౌఁగిట మూసీ-
నింపులు నేసీనేమితఁడు
చెంపల చెమటల శ్రీ వేంకటేశుఁడు
అంపరాని విభుఁడాయఁ గదే