పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0215-5 సాళంగనాట సంపుటం: 08-089

పల్లవి:

అన్నిటా నేరుపరిగా అలమేలుమంగ నీకు
చిన్నిచిన్ని ముద్దులనే సిగ్గువిడిపించెను

చ. 1:

చనవు మెరసి నిన్ను సారెసారెఁ బేరుకొని
మనసు దనియ నాపె మాటలాడెను
కనుసన్నచూపులనె కప్పురవిడెములిచ్చి
తనువు దనియ నీపైఁ దలఁబాలు వోసెను

చ. 2:

పన్నుగడలతోడనే పానుపుచేరువనే
కన్నులుదనియఁగ దగ్గరి నిల్చెను
మన్ననలు దైవార మచ్చికలు పెడరేఁచి
విన్నవీనులు దనియ విన్నపాలు సేసెను

చ. 3:

మాఁగిన మోవియిచ్చ మనసు గరఁచి యిట్టే
కాఁగిలి దనియ నీకుఁ గప్పెఁ బయ్యద
వీఁగక శ్రీవేంకటేశ వెలఁదిఁ గూడితివిట్టె
రాఁగా వయసుదనియ రతికేలిసేసెను