పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0215-4 మాళవ శ్రీ సంపుటం: 08-088

పల్లవి:

అప్పణిచ్చేనిదె నీకు ననుమానించకుమిఁక
చిప్పిల మోహించిన నీచేతిలోనిదానను

చ. 1:

యెంతనవ్వినా మేలే యెరిఁగిన విభుఁడవు
చెంతనుండి మరియేమి సేసినా మేలే
యింతమాత్రమునకే యెగ్గులెంచ తప్పులెంచ
సంతోసాన నీకులోనై సమ్మతించేదానను

చ. 2:

అలయించినా మేలే ఆయములెరుఁగుదువు
కొలువు యిట్టె సేయించుకొన్నా మేలే
మలసినమాత్రానకే మచ్చరించ నెచ్చరించ
చెలఁగుదు నీపాదాల సేవసేసేదానను

చ. 3:

చేరి కూడితివి మేలే శ్రీవేంకటేశుఁడవు
యీరీతినలమేల్‌ మంగనేమన్నా మేలే
సారె యీమాత్రానకే జంకించ బొంకించ
మేరతోనుండుదు నిన్ను మెచ్చేటిదానను