పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0212- -3 భైరవి సంపుటం: 08-069

పల్లవి:

కోపించ నేరుతునా గునిసీఁ దాను
తీపుమోవికిఁగా నేల తిట్టీనే తాను

చ. 1:

పొద్దువోదా వలపులు పోగువోసి వున్నవా
పెద్దరికేలకు నేల పిలిపించీనే
చద్దివేఁడి జవ్వనాన సడి దనమీఁదవేసి
వొద్దనున్న నన్నింతేల వొరసీనే తాను

చ. 2:

మాటలేదా మరి తనమనసుకు రూపుగద్దా
చీటికిమాటికి నేల చేఁత చేసీనే
పాటించిన తమకాన పంతమెల్లా తనకిచ్చి
యేటవెట్టుకొంటే యాలయెగ్గురేఁచీఁ దాను

చ. 3:

ఇట్టెకొత్తా తనలోని యెన్నికకు తప్పుగద్దా
పట్టి కాఁగిలించి యాల భ్రమయించీనే
గుట్టుతో శ్రీవేంకటేశుఁ గూడి నే సంతోసించఁగా
గట్టియైనందుకు నెంత కరఁచీనే తాను