పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0212-4 తెలుఁగుఁగాంబోది సంపుటం: 08-070

పల్లవి:

ఒద్దేలే జగడాలు వోయింతి
సిద్దెబట్టి కోరికలు చిత్తఁగించఁ గదవే

చ. 1:

మొగముచూచి యతఁడు మోవితేనెలడుగఁగా
వొగరులేలాడేవే వోయింతి
నగవుల పంచదార నాథుఁ డందుపై జల్లి
జిగి చవిచేకొనీఁ జిత్తగించఁ గదవే

చ. 2:

వాటపు వలపతఁడు వారవట్టుకుండఁగాను
వూటలేల పోఁ జల్లేవే వోయింతి
పాటించి సరసముల పన్నీరతఁడు నించి
చీటికి మాటికి వేఁడీ చిత్తగించ గదవే

చ. 3:

అప్పుడే కాఁగిటఁ గూడి ఆయములతఁడంటఁగా
వుప్పతించేవేలె రతులోయింతి
చిప్పిలె కాఁగిటిలోన శ్రీవేంకటేశ్వరుఁడు
చెప్పరాని చేఁత సేసీఁ జిత్తగించ గదవే