పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0205-4 మధ్యమావతి సంపుటం: 08-028

పల్లవి:

ఏది నాకు బుద్ది యిఁకనేమి సేతును
యీదె నీకృప నాపై యిరవైవున్నది

చ. 1:

మందలించి నీతో నేను మాటలాడేనంటేను
యెందునో పరాకు నీకు నేమిసేతును
విందువెట్టి మోవితేనె వెసనీకిచ్చేనంటే
చిందరై నీయధరము చీకాకై వున్నది

చ. 2:

నవ్వు నవ్వి నీతోను నటనలు నేనేనంటే
యెవ్వలనో జూడమాడేవేమిసేతును
పువ్వువలె నీమేను పొదిగి భోగించేనంటే
చివ్వనఁ బెంజెమటల చిత్తడి మైనున్నది

చ. 3:

పరపుపై నిన్నునేను పచ్చిగాఁ జేసేనంటే
యిరవుగా వేడుకొనేవేమిసేతును
గరిమె శ్రీవేంకటేశ కలసితివిటు నన్ను
నిరతపు నీమోహము నిజము నాకైనది