పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0205- 5 శుద్దవసంతం సంపుటం: 08-029

పల్లవి:

ఇచ్చగించి నవ్వు నవ్వేవేమనేవయ్యా
యెచ్చుకుందు లేదు మీలోనిఁకనానతీవయ్యా

చ. 1:

యిందుముఖి నీకు మొక్కి యిచ్చెనిదివో కానికె
అందుకు నీవేమనేవు ఆనతీవయ్యా
చెంది నీతో సిగ్గువడి చేరువ నిలుచున్నది
యెందాఁకా వట్టిజోలి యిఁకనానతీవయ్యా

చ. 2:

కన్నులఁ దప్పక చూచి కంబము వట్టుకున్నది
అన్నీనాయ నీతలఁపు ఆనతీవయ్యా
సన్నలు మాకుఁ జేసీ సంగడికిఁ దెమ్మనుచు
యెన్నరాదు తమకము యిఁకనానతీవయ్యా

చ. 3:

యేకశయ్యమీఁదనుండి యెడమాటలాడించీ
ఆకతలవి యెట్టివో ఆనతీవయ్యా
కైకొని శ్రీవేంకటేశ కాంతనిట్టెకూడితివి
యేకాలముఁ బాయమని యిఁకనానతీవయ్యా