పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0247-1 నాదరామక్రియ సంపుటం; 08-277

పల్లవి:

ఊరకుండవయ్యా వుడివోవు వలపులు
కోరుకొంటా వున్నదాన గొప్పలు నీకన్నులు

చ. 1:

చనవు నీవిచ్చితివి చలము లన్నియుఁ దేరె
మనసొక్కటాయ నీతో మారుమాటేల
ననిచివుందాన నిదె నన్ను నేల రేఁచేవు
వినుకొంటానున్నదాన వింతలు నీసుద్దులు

చ. 2:

ప్రియములు చెప్పితివి పెనఁగితివిందాఁక
నయమాయ సరసాలు నవ్వులంతేల
క్రియ నే నెఱుఁగుదును కెరలించ కిఁక నీవు
జయము చేకొంటి నిదె చక్కనె నీమాటలు

చ. 3:

తెలిపితివి బుద్దులు దిష్టముగాఁ గూడితివి
వెలసె నీమోములు వెరపు లేల
యెలమి శ్రీ వెంకటేశ యెచ్చరించకు గోరను
తలపోయుచున్నదాన తగు నీగుణములు