పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0239-2 భైరవి సంపుటం: 08-230

పల్లవి:

ఊరకే గడించుకొనీ వొక్కటొక్కటే తాను
మారుకొంటినంటాఁ దానే మతకానఁ జూచీనే

చ. 1:

తనివిదీరక వెనుతగిలితే నాయకుఁడు
యెనసి నే నమ్మనంటా నెగ్గుపట్టీనే
చనవు చేసుక మరి సరిఁ గొంగువట్టితేను
పెనఁగి పోనియ్యనంటా పెక్కులాడీనే

చ. 2:

చుట్టముఁజేసుక తన్ను సుద్దులెల్లా నడిగితే
పెట్టుకుండె నెపాలంటా బీరాలెంచీనే
వొట్టిన యాసలతోడ వొళ్ళు గాఁగిలించుకొంటే
అట్టె బలిమి సేసితినంటా దూరీనే

చ. 3:

కందువ రతికేళికి గడియ నేఁ బెట్టితేను
యిందరి నంటనీవంటా నింత సేసినే
అందపు శ్రీవెంకటేశుఁ డప్పటిఁ దన్నుఁగూడితె
పొందుల భ్రమించెనంటా పూఁచి నవ్వీనే