పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0239-3 సామంతం సంపుటం: 08-231

పల్లవి:

మీలోనే కలిముదిరి మేడి దాయను
జాలిదీర నెటువలె సరసమాడేవే

చ. 1:

కప్పురమువంటి నవ్వు కారీని సెలవుల
గొప్పగొప్పకన్నులను కోపమేఁటికే
కుప్పె సవరపుపతిఁ గొప్పువట్టి తీసితివి
దెప్పరపు చేఁతెట్లాఁ దీరుచుకొనేవే

చ. 2:

వుట్టి తేనెవంటి మాటలూరీని పెదవుల
తిట్టులు నాలిక నెట్టు దీకొలిపేవే
పట్టి బంగారుపాదుక బలిమి మేననూఁడితి
యిట్టి పంతమాతనికి నెట్టుదిద్దేవే

చ. 3:

రీతి జిరుగువంటిది రేకలు నీమేన నివే
ఱాతిచన్నులనెట్టొత్తి ఱట్టుసేసేవే
యీతల శ్రీవెంకటేశు నెనసితి వింతలోనే
నీతితో యిప్పుడెట్లా నీవుమొక్కేవే