పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0237-5 ముఖారి సంపుటం: 08-221

పల్లవి:

సిగ్గువడ నీకేల చింతలేలా
తగ్గు మొగ్గులేలా నీకు తలవంచ నేఁటికి

చ. 1:

విన్న కన్న సుద్దులెల్లా వెల్లవిరి సేసేనంటే
కన్నుల జంకించి చూచి కాఁతాళించేవు
అన్నినీమొకదాకిరి నాతుమలోఁ బెట్టుకొంటే
చిన్ని సెలవుల నాకు చిరునవ్వయి ముంచెను

చ. 2:

నానాటికి నీగుణాలు నానించి కడిగేనంటే
కోనల ముంజేయివట్టి గోరనొత్తేవు
పాని నీపై మచ్చరము పండ్లఁ బెట్టుకుండితేను
మోనాన వాండ్లెక్కి నీమోవిమీఁద నిండెను

చ. 3:

సొరిది నీమనసిది సోదించి మెచ్చేనంటే
కరఁగి కరఁగి యట్టే గారవించేవు
గరిమ శ్రీవెంకటేశ కలసితి మొక్కేనంటే
తరితీపులై చేతికి తలఁబాలై నిండెను