పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0235-6 గుజ్జరి సంపుటం: 08-210

పల్లవి:

అప్పుడే గెలిచితివా ఆపె వూరకుండితేనే
తప్పులు నీమీదివెల్లా దాఁచుకిట్టేవున్నది

చ. 1:

పలుకనేరదుగాని భావములోనిచేఁత
బెళకకుండా నట్టె పెట్టుకున్నది
అలుగకున్నదిగాని అనువువచ్చినదాఁకా
చలములు యేకతాన సాదించనున్నది

చ. 2:

జంకించకున్నదిగాని జగడాలు కొనగోళ్ళ
యింకనెప్పుడోయని మీఁదెత్తుకున్నది
కొంకి తిట్టేదేకాని గురియైన రతిదాఁకా
పొంకపు బూతుమాటలఁ బూఁచుకున్నది

చ. 3:

గుట్టువిడవదుగాని కొసరుల మొక్కులెల్లా
దట్టమై నీపాదాలకు దాఁచుకున్నది
యిట్టె శ్రీవెంకటేశ యెనసితివిందాఁకా
అట్టెవున్నది నీతలపుఁ లడుగఁగనున్నది