పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0235-5 సామంతం సంపుటం: 08-209

పల్లవి:

అట్టె కానీవయ్య నేము నట్లానె సేసేము
గట్టియైన సతులకుగాని నీవు లోఁగవు

చ. 1:

కామించి నీవాకిలి గాచుక నేనుండఁగాను
నామొగము చూచి నీకు నగవురాదా
వేమరుఁ బంతములాడి వెసఁ బసులఁ గాపించే
గామిడి గొల్లెతలకుఁగాని నీవు లోఁగవు

చ. 2:

యేపొద్దును నీరూపే యెగదిగఁజూడఁగాను
నాపొంతనేవుండి నీకు నగవురాదా
చేపట్టి మానాలుచూడ చెట్టెక్కించి వేళలు
కాపించే గొల్లెతలకుఁగాని నీవులోఁగవు

చ. 3:

యెనసి నీకాఁగిటిలో యేపొద్దూ నేనుండఁగాను
ననుఫైతే నీకింతేసి నగవురాదా
మును శ్రీవెంకటేశ యమునలోనాటలాడించే
ఘనమై గొల్లెతలకుఁగాని నీవు లోఁగవు