పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0228-4 భూపాళం సంపుటం: 08-166

పల్లవి:

చవులుసేక నీవు సారెసారెకు
అవరములతోడ నారగించవయ్యా

చ. 1:

మాటలమూటల చద్ది మనసులో చిలుపాలు
యేఁటిసేసి విందువెట్టి నింతి నీకును
పాటలపంచదారలు పచ్చిమోవితేనెలు నీ
యాటలాయ నేఁడిట్టే ఆరగించవయ్యా

చ. 2:

జంకెనల కారాలు చవుల సాకములు
లంకెల విందులు వెట్టీ లలన నీరు
పొంకపుఁ జూపులంబళ్ళు పొరినవ్వుల పచ్చళ్ళు
అంకెలాయ నేఁడిట్టే ఆరగించవయ్యా

చ. 3:

కరజపు వినయాలు కాఁగిటి రతిబువ్వాలు
సిరులతో విందువెట్టీ శ్రీ సతి నీకు
గరిమ శ్రీ వెంకటేశ కలసితి రిద్దరును
అరుదాయ నేఁడిట్టే ఆరగించవయ్యా