పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0228-5 కాంబోది సంపుటం: 08-167

పల్లవి:

ఎరవుగా నీవు నన్ను ఇందరివలెఁ జూచేవు
దొరతనమే కాక దొమ్మిసేసేనా

చ. 1:

వలపు నీపైఁ జల్లి వానికిఁ బెనగేఁ గాక
చెలులతో జగడాలు సేసేదాననా
పలుకుల బువ్వాలబంతికి వచ్చేఁ గాక
అలుకలు మీద మాటలాడేదాననా

చ. 2:

యింగితమెరిఁగి నిన్ను నింటికిఁ బిలిచేఁ గాక
కొంగువట్టి తీసి యింత కొచ్చేదాననా
పొంగుచు నీవద్దనుండి బుద్ది చెప్పేదానఁ గాక
సంగతి దెలియకింత సాదించేదాననా

చ. 3:

కప్పురము నోరికిచ్చి కారాలు రేఁచితిఁ గాక
చిప్పిల నీమోవి గంటిసేసేదాననా
ముప్పిరి శ్రీవెంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
అప్పసపుదానఁగాక అటువంటిదాననా