పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0228-1 శ్రీరాగం సంపుటం: 08-163

పల్లవి:

బంగారువంటిదాన పచ్చివిటుఁడవు నీవు
యెంగిలి నీమాటవింటి నేమి సేతురా

చ. 1:

కందువగు నీమేను కాఁగిలించఁగానె నామై
చందముగ నీమేనిలచ్చనలంటెను
చిందరవందరలైన జీడివంటిది వలపు
యిందులోనే కొనవచ్చె నేమిసేతురా

చ. 2:

మొక్కితి నీపాదాలకు ముందర మొక్కినవారి
యెక్కడో కస్తూరిబొట్టు యిదె నన్నంటె
మొక్కలాన ముయికిని ముయివంటిది వలపు
యిక్కడనే కానవచ్చె నేమిసేతురా

చ. 3:

బాగాలు నీకిచ్చితేను పాఁగిన నీతమ్ములము
పోగులై తోడుత నాపుక్కిలి నిండె
బాగుగా శ్రీవెంకటేశ పంటవంటిది వలపు
యీగతినే కానవచ్చెనేమిసేతురా