పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0227-6 ముఖారి సంపుటం: 08-162

పల్లవి:

మిక్కిలి కళదేరేవు మేలుగా నీవు
చక్కని సరసానకు జాణవుగా నీవు

చ. 1:

యెప్పుడూను వింతలేదు యేసతుల యడాటాన
మెప్పించుకోనేర్తువు మేలుగా నీవు
చిప్పిల నవ్వు నవ్వితేను సిగ్గుపడవేమిటాను
చెప్పరాని మహిమలు సేతువుగా నీవు

చ. 2:

అంగళ్ళ ముంగిళ్ళ నల్లారుముద్దు చూపేవు
మెంగతనాలు నీసొమ్ము మేలుగా నీవు
సంగడి నేఁ జెనకితే సమ్మతించే వెందుకైనా
జంగిలి రతులకు వేసరవుగా నీవు

చ. 3:

పిలిచితేఁ బలికేవు భేదము లేదేమిటాను
మెలకువగల వింత మేలుగా నీవు
అలరి శ్రీవెంకటేశ అంటితేనే కూడితివి
కలపుకోలన్నిటాను కలవుగా నీవు