పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0227-2 కాంబోది సంపుటం: 08-158

పల్లవి:

వట్టి పంతములనేల వసివాడువాడ నీకు
నెట్టన నీవాఁడనని నిలుచుండరాదా

చ. 1:

కలికిచూపులు నీకుఁ గలువరేకులెకాక
వెలినుండి యింతలోనే వెట్టలయ్యీనా
పొలసిన విరహానఁ బొరలేవు యీడనుండి
వలచి వచ్చితినంటా వద్దికి రారాదా

చ. 2:

కామిని నవ్వులు నీకుఁ గప్పురవిడేలే కాక
చే ముంచి మరివేరే చేఁదయ్యీనా
ఆమని యాసలతోడ నసురుసురయ్యేవిట్టే
దోమటిమోవితేనెలు తొడుకఁగరాదా

చ. 3:

కాంతమాటలు నీకుఁ గట్టిన ముడుపు గాక
చింతల నింతలోననే చిల్లరయ్యీనా
యింతట శ్రీవెంకటేశ యెనసితి విందుమండే
పొంతకు వచ్చినందుకు పూఁచి మొక్కరాదా