పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0227-3 లలిత సంపుటం: 08-159

పల్లవి:

ఎఱఁగమైతిమయ్య (మమ్మ?) యిన్నాళ్ళును
కఱకరిఁ బెట్టఁగోరే కాతరీఁడా తాను

చ. 1:

పొందులిట్టే రేఁచఁగాను పొత్తులు వేడుకలాయ
సందడించఁగా వలపు చవులాయను
యిందాఁకాఁ దనమనసెవ్వరిదై వుండెనే
ముందు వెనక లెంచని మొక్కలీఁడా తాను

చ. 2:

కాయము గిలిగించఁగా గక్కన నవ్వులు వుట్టె
చేయి చేతనంటఁగాను చెమరించెను
పాయపుమదమెవ్వతె పంచనుండెనే యిన్నాళ్ళు
చాయలు సన్నెరఁగని జడ్డువాఁడా తాను

చ. 3:

గక్కున నేఁగూడఁగాను కళలు మోమున నిండె
నొక్కుచు మోవియ్యఁగాను నోరూరెను
యిక్కువ శ్రీవెంకటేశుఁడెంత భ్రమసి వుండెనే
యెక్కువ నాతోరమించె నిచ్చకుఁడా తాను