పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0226-6 ముఖారి సంపుటం: 08-156

పల్లవి:

ఆయలవాటే చూచి అప్పటిమాతో నేఁడు
చాయలనీపనికెంత సాముసేసెనో

చ. 1:

వీడెమియ్యఁగలఁ గాక వీడెమిచ్చే చేతుల
తోడఁ దోడఁ బెనఁగఁగా దొబ్బఁగలనా
వోడక ని నిష్ఠూరానకొడిగట్టే సతులనుఁ
గూడి యేమిసేయించుకొని వచ్చెనో

చ. 2:

మాటలాడఁగలఁ గాక మంచితనమైన నోట
తేటగా నవ్వేటి తన్నుఁ దిట్టఁగలనా
నీటున రాఁగతనాలు నెరుపేటి కాంతలను
పాటించి కలసి యేమి భ్రమసినాఁడో

చ. 3:

కాఁగిలించఁగలఁ గాక కైకొన్న చేతుల గోళ్ళ
చేఁగదేర మొక్కఁగాను చిమ్మఁగలనా
వీఁగక శ్రీవెంకటాద్రి విభుఁడిట్టె నన్నుఁ గూడె
యేఁగి వచ్చి యేయింతులకిట్టె పంతమిచ్చెనో