పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0226-5 మేఁచభౌళి సంపుటం: 08-155

పల్లవి:

నీవారమిన్ని టాను నీకంటెనెక్కుడు లేరు
సేవలు సేసేము నీవు చిత్తగించవయ్యా

చ. 1:

సేసినచేఁతలు నీవే చెల్లఁబెట్టుదువు గాక
యీసరి మానేరుపులు యేమున్నవి
సేసవెట్టి రాజు వలచినదే దేవులందురు
రాసికెక్క నీసొమ్ము రక్షించుకోవయ్యా

చ. 2:

పట్టిన నీపంతమే బలువు సేతువు గాక
యెట్టెన మాగుణములు యేమి చూచేవు
అట్టే పరుసమంటితేనదియే బంగారందురు
పెట్టని చోట్లఁ బెట్టి పెద్ద సెయ్యవయ్యా

చ. 3:

కూడిన నీకూటములె గురులు సేతువు గాక
యీడనే మాయసోదాలేమున్నవి
యేడను శ్రీవెంకటేశ యేలితేనే బంటందురు
పాడేటివారము నిన్ను బత్తిచేకోవయ్యా