పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0226-3 శంకరాభరణం సంపుటం: 08-153

పల్లవి:

నేఁడె శుక్కురారము నెలఁతలాల
పోఁడిమి సేవసేయరే పుణుఁగుకాపు

చ. 1:

పన్నీటి కాలువలు పారీనిఁజూడరే
అన్నిటాఁ గొండవంటి శ్రీహరిమీఁదను
యెన్ననభిషేకమంత్రాలిదె చెప్పేరు వినరే
తిన్నని పుళుగుకాపు దేవునికి నేఁడు

చ. 2:

రాలీని కప్పురరజమిదె చూడరే
నీలమేఘమువంటి యీ నీరజాక్షుపై
తాలమితో జాలువారీ తట్టుపుణుఁగదిగోరే
పోలింపఁ బుణుఁగుకాపు పురుషొత్తమునికి

చ. 3:

అలమేలు మంగతోడి హారాలు సేవించరే
వెలయ ధరించెను శ్రీవెంకటేశుఁడు
పలువిందులారగించె బాగాలు యియ్యరే
చెలఁగీ పుణుఁగుకాపు శేషాద్రిపతికి