పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0225-6 ఆహిరి సంపుటం: 08-150

పల్లవి:

ఏమయ్య యిందుకు నిన్నే మందును
కామించవలదా కైకొని నీవిపుడు

చ. 1:

గాలించి గాలించి కలికి మాటలాడఁగా
లాలించవలదా లలనఁ గొంత
పోలించి పోలించి పొగడఁగా నప్పటిని
పాలించవలదా పయికొని నీవిపుడు

చ. 2:

సోదించి సోదించి సుద్దుల నిన్ను మెచ్చఁగా
ఆదరించఁగ వద్దా అన్నిటా నీవు
సాదించి సాదించి సరి నీతో నవ్వఁగా
మోదించవలదా మొదల నీవిపుడు

చ. 3:

కరఁగించి కరఁగించి కాఁగిట నిన్నుఁ గూడఁగా
పొరయించవలదా పొందుల నేఁడు
సిరులుమించఁగ మించ శ్రీవెంకటేశుఁడుగూడె
యిరువుకోవలదా యిచ్చకములిపుడు