పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0223-2 సామంతం సంపుటం: 08-134

పల్లవి:

నీకే తెలునాపెకు నీకంటేఁ దెలుసు
వాకు నిష్ఠూరాల మీలో వంతువెట్టేవారమా

చ. 1:

సందడించి నీపయినింతి సణఁగులు చల్లఁగాను
విందువలె నీ వాపెను వేఁడుకోఁగాను
కందువచూడఁ గన్నులు గలవారమింతే నేము
చెంది మీతో సాకిర్లు చెప్పేటివారమా

చ. 2:

పంతమాడి నీకు చెలి పగటులు చూపఁగాను
యెంతకైనా నీవాపెతో నియ్యకోఁగాను
సంతలోని పనివలె సమ్మతించేవారమింతే
బంతిఁబెట్టి మిమ్ము నొడఁబరచేవారమా

చ. 3:

కాయమిచ్చి సతి నిన్ను కాఁగిటఁ గూడఁగాను
నీయంత శ్రివేంకటేశ నీవు మెచ్చఁగా
పాయపు వలపు తొల్లే పాలువట్టేవారమింతే
నాయములు చెప్పి మిమ్ము నవ్వేటివారమా