పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0222-4 గౌళ సంపుటం: 08-130

పల్లవి:

ఏలయ్య యింతేసి మమ్ము యిటు రట్టుసేసేవు
తాలిమితోడుత నీదయలోనివారము

చ. 1:

కనుఁగొన చపులనే కరఁగించితిననేవు
వినయాలు చెప్పనీకు వింతవారమా
పెనఁగి మోవితేనెల పిలిచి విందువేట్టేవు
వెనకా ముందరా నీకు వినయాలవారమా

చ. 2:

సరుగ మంచముపై నాసలఁ గూచుండుమనేవు
సరుకు రాను నీసరివారమా
యెరవుసేయక మాతో నేకతములాడేవు
అరసి నీకు బుద్దిచెప్పేయంతేసివారమా

చ. 3:

కలసిన రతులెల్లా ఘనముగాఁ బొగడేవు
తొలుతనే నీకంటె దొడ్డవారమా
చెలఁగి శ్రీవేంకటేశ చేకొని కూడితివిట్టే
పొలసిన నీవంటి పోలికలవారమా