పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0057-5 సామంతం సంపుటం: 06-095

పల్లవి:

చక్కఁదనములు గొంత జాణతనములు గొంత నీ
వెక్కసము లెల్లఁ జాలు వేసాలఁ బోకురా

చ. 1:

పూసిన తట్టు పుణుఁగు బూమిలోనా లేనివింత
వాసనై లోకము వారి వలపించఁగా
ఆసలనే మమ్ముఁ గడు నలయించే వోరి నీవు
చేసినట్టె చేతు గాని చెఱఁగు విడువరా

చ. 2:

మెత్తినట్టి మృగనాభి మేన నెల్ల నిండె నిత్య
కొత్తలై నీ సొబగెల్లఁ గుప్పళించంగా
బిత్తరి చూపులతోడ ప్రియమైన కడకేఁగి
వత్తుగాని అంతకు నీవన్నె చూడనియ్యరా

చ. 3:

కట్టినట్టి పచ్చఁబట్టు కమ్మని పువ్వులతావి
యిట్టు నట్టు నెల్లవారి నెలయించఁగా
దిట్టనాయకుఁడ వోరి తిరువేంకటేశ నీ
పట్టినచలమే దక్కె బాపు వూరకుండరా