పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0057-4 కాంబోది సంపుటం: 06-094

పల్లవి:

ఇన్నియుఁ గొత్తలు దోఁచె నింతలోనె చెలి నీకు
విన్నని నగవు లెస్సవిధ మేఁటి కాయెనే

చ. 1:

పెట్టిన కస్తూరి బొట్టు పెదవిపై కేలా జాఱె
కట్టిన చెంగావి కెంపు కన్నుల కే లెక్కెనె
పుట్టిన లేఁజమటలు పులక లేఁటికిఁ గప్పె
పట్టిన తామరమొగ్గ పదనేఁటి కాయెనే

చ. 2:

కప్పినపయ్యదకొంగు కడకు నేఁటికి జాఱె
తిప్పిన మొగములోన తెలివేటిఁకుండెనే
చెప్పినమాటలలోన చిఱునవ్వు లేల తోఁచె
ఒప్పైన చెలువ నీకు నొరుపేఁటి కాయెనే

చ. 3:

నిండిన సైరణలకు నిజ మేల లేదాయె
పండిన కోరికలకు ప్రాణ మేల వచ్చెనే
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు గూడె
యెండ లేని నీడ నీకు నితవేల ఆయెనే