పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0057-2 శ్రీరాగం సంపుటం: 06-092

పల్లవి:

కటకటా విరహు లెక్కడ బ్రదుకఁగలవారు
కుటింలపుఁ గీరముల గూఁటఁ బడ వాయె

చ. 1:

పంచబాణునకు నాపద లెందు లేవాయె
మంచుఁగిరణము లతనిమీద మణఁగదాయె
పెంచుకోవిలనోరు పెడతటికిఁ బోదాయె
చంచరీకములకునుఁ జావు లేదాయె

చ. 2:

చిగురాకుఁ గులమునకుఁ జే టెందు లేదాయె
పగటు నునుగాలిఁ బెనుఁబాము దినదాయె
సొగఁసుసగమ్మని విరులచొప్పణఁగి పోదాయె
బిగువు నామనిమీఁదఁ బిడుగువడదాయె

చ. 3:

తిరువేంకటాచలాధిపుని కరుణారసము
తరుణులకు నందఱికి దైవాఱదాయె
పరివోని సురత సంపదలఁ దెప్పలఁదేలి
వరవధూతతికిఁ బరవశము లేదాయె