పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0043-2 శ్రీరాగం సంపుటం: 06-008

పల్లవి:

ఒప్పదువోయింత కొరపులం జూఁడేవు నా
నొప్పులెఱుంగవు యింత నొగిలించే వేలరా

చ. 1:

తెల్లని కన్నుఁ గొన తీగె మెఱుపుల చూపు
చల్లకునే నాగుండె జల్లనీని
మెల్లని సొలపుల మెత్తనిమాటలకు నే
దల్లడించఁగానె యింతతాఁక నాడే వేలరా

చ. 2:

పూఁచిన యొఱుపుల బొమ్మముడిజంకెనల
లోఁచకువే మనసు చిల్లులువోయీని
దాఁచిన నీ చిత్తపు బిత్తరపుటానలు నాపై
చాఁచి చాఁచి పలుమారు చంపంజూచేవేలరా

చ. 3:

చిమ్ముల మురిపెపుఁ జిఱు నవ్వులనే నన్నుఁ
గ్రుమ్మకువే మనసెల్ల గొల్లంబోయీని
దిమ్మరిజాణఁడవోరి తిరువేంకటేశ నన్ను
క్రమ్మరఁ గ్రమ్మరఁ గూడి కాఁకరించేవేలరా