పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0043-3 శ్రీరాగం-ఏకతాళి సంపుటం: 06-009

పల్లవి:

తొల్లిటివలెఁ గావు తుమ్మెదా యింక
నొల్లవుగా మమ్మునో తుమ్మెదా

చ. 1:

తోరంపు రచనల తుమ్మెదా కడుఁ
దూరేవు గొందులే తుమ్మెదా
దూరిన నెఱఁగవు తుమ్మెదా మమ్ము
నోరగఁజూడకువో వో తుమ్మెదా

చ. 2:

తొలు ప్రాయపు మిండ తుమ్మెదా కడుఁ
దొలిచేవు చేఁగలే తుమ్మెదా
తొలుకరి మెఱుఁగనే తుమ్మెదా యింక
నులికేవు మముఁగని వో వోతుమ్మెదా

చ. 3:

దొరవు వేంకటగిరి తుమ్మెదా మా
తురు మేల చెనకేవు తుమ్మెదా
దొరకె నీ చనవులు తుమ్మెదా యింక
నారు లెఱింగిరి గదవో వో తుమ్మెదా