పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0043-4 శ్రీరాగం సంపుటం: 06-010

పల్లవి:

చాలు నింక నిటువంటి సంసారము మరుని
పాలైతి నిపు డింటి భాగ్యమిది నాకు

చ. 1:

తనియు కిటు నీవు గాంతల నెల్లనా యెదుట
గొనియాడ దొరకొంటి కొంకులేక
వినియుఁ బ్రాణము తోడ విషమైన యీకూడు
దినఁజేరినది యేఁటి దేహ మిది నాకు

చ. 2:

వెఱవ కిటు సతుల నీ వెను వెంటఁ బెట్టుకొని
మెఱయ దొరకొంటివిదె మేరలేక
యెఱిఁగియునుఁ దీపనుచు నిట్టి నీ మన్ననల
చెఱఁబెట్టినది యేఁటి జీవమిది నాకు

చ. 3:

ఎక్కువగు నీతరుణు లిందరిని నాకిట్ల
మ్రొక్కించ దొరకొంటి మొఱఁగు లేక
గ్రక్కునను నన్ను వేంకటగిరీశ్వర కలసి
చిక్కనైతివి చాలుఁ జిన్నమిది నాకు