పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0056-4 సామంతం సంపుటం: 06-088

పల్లవి:

పలుకులఁదేనియ లొలికెడిచక్కని
వెలఁదులు కోనేటి విభునిఁ బాడెదరె

చ. 1:

నలికపుఁజూపుల నగవుల నునుసిగ్గు
దొలఁకంగ నిగ్గు దోఁపంగ
కలికికి కన్నుఁగవ కాంతలు ప్రేమ
నెలయించి తిరువేంకటేశునిఁ బాడెదరె

చ. 2:

పెదవుల సన్నపు బీటల మెఱుఁగులు
పొదలంగ ముద్దులు పొలయంగా
వదనము సొబగులు వనితలు కడుఁ
గదసి వెంకటగిరి ఘనునిఁ బాడెదరె

చ. 3:

భారపుఁ గుచముల కన్నీటి చెమటలు
జారంగా తావిచల్లంగా
కూరిమి రచనలు గొసరుచుఁ గడు
ధీరునిఁ గోనేటి తిమ్మనిఁ బాడెదరె