పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0055-5 భూపాళం సంపుటం: 06-083

పల్లవి:

అంతదొడ్డవారమా అందుకుఁ దగుదుమా
మంతనపు మాటల మరగించేవు

చ. 1:

నిన్నుఁ బోలువారమా నీయంతవారమా
వెన్నెలుఁ జల్లలు నమ్మువెలఁదులము
పన్నిన యీ రత్నాల బంగారుటిండ్లలో
యెన్నకైన తూఁగుమంచు మెక్కు మనేవు

చ. 2:

చెప్పరానివారమా చెమటపై వారమా
కప్పురంపుఁ జవి యెఱుఁగనివారమా
చిప్పిలేటితేనెల సేమంతివిరుల
చప్పరములోనికి సారెఁ బిలిచేవు

చ. 3:

జంకెనలవారమా సరసపు వారమా
మంకుమంకు మాటల మందవారమా
వేంకటాద్రి విభుఁడా వేడుకలరాయఁడా
తెంకికి నెప్పరిగమిఁదికి రమ్మనేవు