పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0055-6 ముఖారి సంపుటం: 06-084

పల్లవి:

నినుఁ బాసినయట్లు నెలఁతకు వియోగదశ
లెన్నడునుఁ దోప విది యేమోగాని

చ. 1:

నినుఁ దలచి లలితాంగి నీరూప మాత్మలోఁ
గని నీవు నవి బయలు కౌఁగిలించినది
తనర నాకాశతత్త్వము నీమహత్త్వమని
వనిత యెవ్వరిచేత వినెనోకాని

చ. 2:

నినుఁ బొగడి నీరూపు కనుదోయి కెదురైన
తనివి దీఱక బయలు తగఁ జూడఁదొడఁగి
మునుకొన్న సర్వతోముఖుఁడ వనఁగా నిన్ను
వెనుక కే భావమున వినెనో కాని

చ. 3:

తలఁపునను వాకుననుఁ దలఁపఁ దలఁపఁగ నీవు
కలసి యీ కమలాక్షిఁ గౌగిలించితివి
తెలసితిమి వేంకటాధిపతి నీ విన్నింటఁ
గలవనెడిమాట నిక్కంబువోకాని