పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0055-2 భైరవి సంపుటం: 06-080

పల్లవి:

భామ తొల్లిటి పూజఫలము సఫలముగాను
యేమఱక వేడుకల నిట్లఁ బూజించె

చ. 1:

నొసలిలేఁ జెమటలను నునుఁగురులఁ బూజించె
కసిగాట్ల నధరంబు కలయఁ బూజించె
కొసరు కనుఁగవ కెంపు కొనలఁ బూజించె
వసివాడు మేనిపై వాసనలఁ బూజించె

చ. 2:

మొలకనవ్వుల ముద్దుమో మలరఁ బూజించె
చిలుకుఁ జూపుల లోని సిగ్గుఁ బూజించె
నిలువుఁబులకలచేత నిలువెల్లఁ బూజించె
నెలఁతచనుదోయి క్రొన్నెలలఁ బూజించె

చ. 3:

మనసు గోరికల కళ మర్మములఁ బూజించె
గొనకొన్న రతులచేఁ గొలికి పూజించె
ఎనసి శ్రీ తిరువేంకటేశు కౌఁగిటిలోన
వనిత సంభోగ పరవశముఁ బూజించె