పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0054-6 భూపాళం సంపుటం: 06-078

పల్లవి:

నిండిన యాసల యెండ నీడలాయె నేఁటికే
బెండువడ్డ మేనుఁదీగె బీరువోయెనేఁటికే

చ. 1:

నుదురైనశశి నీచన్నుల కేల జాఱెనె
చెదరి నీముత్యాలు చెక్కుల కే లెక్కనే
ముదిత నీతో సిగ్గు ముంగి లేల వెళ్లెనే
నిదురమానిన మోము నిగ్గులేల తోఁచెనె

చ. 2:

బచ్చన నీ సింగారము బయలేఁటికాయెనే
ముచ్చట నీ మాటలకు ముసుగేల జాఱెనే
వెచ్చిన నీ మేని సొంపు వింతదోఁచె నేఁటికే
మచ్చిక నీకోరికలు మదమెక్కె నేఁటికే

చ. 3:

చూపులు వెన్నెలమించుఁ జూరలాడె నేఁటికే
కోపపు నీజంకెనలగొనబాయె నేఁటికే
ఏపుమీఱి తిరువేంకటేశుఁ గూడి నీకుఁ
దాపలైనతలఁపులు దరిచేరె నేఁటికే