పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0054-5 సామంతం సంపుటం: 06-077

పల్లవి:


ఎరవు గడు సత మాయె నిదియెకదవె
అరవీడుటే సొబగు లాయెఁ దురుమునకు

చ. 1:

నిక్కముగ ననలమున నీరు జనియించెనను
టిక్కడనె పొడగంటి మిదియుఁగదవె
పొక్కుచును విరహాగ్నిఁ బొరలఁగాఁ జెలిమేనఁ
జక్కఁ బైపైఁ బొడమె జవ్వాది చెమట

చ. 2:

కలుగు ననలంబుకడ గాలి యనఁగా నదియు
నెలమి నిచ్చట కలిగె నిదయెకదవె
చెలఁగేటి చెలిమేనఁ జిత్త జాగ్నికిఁదోడు
నిలువ నియ్యక కలిగె నిట్టర్పుగాలి

చ. 3:

నీడల నెండలును నెయ్య మలరఁగఁ గూడు
టీడనే పొడగంటి మిదియుఁగదవె
వేడు కలరంగఁ దిరువేంకటేశ్వరుఁ గూడి
వాడుదేరఁగఁ గలిగె వనిత పరవశము