పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0054-2 సాళంగనాట సంపుటం: 06-074

పల్లవి:

పలుకుఁదేనెల తల్లి పవళించెను
కలికితనముల విభునిఁ గలసినది గాన

చ. 1:

నిగనిగని మోముపై నెఱులు గెలఁకులఁ జెదర
పగలైన దాఁక జెలి పవళించెను
తెగని పరిణతులతోఁ దెల్లవాఱినదాఁక
జగదేకపతి మనసు జట్టిగొనెఁగాన

చ. 2:

కొంగుజాఱిన మెఱుఁగు గుబ్బలొలయఁగఁ దరుణి
బంగారు మేడపైఁ బవళించెను
చెంగలువ కనుఁగొనల సింగారములు దొలఁక
నంగజగురినితోడ నలసినదికాన

చ. 3:

మురిపెంపు నటనతో ముత్యాలమలఁగుపై
పరవశంబునఁ దరుణి పవళించెను
తిరువేంకటచలాధిపుని కౌఁగిటఁ గలసి
యరవిరైననుఁ జెమట నంటినదికాన