పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0054-1 పాడి సంపుటం: 06-073

పల్లవి:

చింత లేమనుచుఁ జేసితివో
కాంతాళించియుఁ గదలదు మనసు

చ. 1:

నిలువునఁ బులకలు నిండెను నామెయిఁ
దలపున నేమని తలఁచితివో
సొలసియు నినుఁ గడు సోఁకఁగ నాడఁగఁ
దలఁచియు నాలికఁ దగులదు మాట

చ. 2:

తాపమె హృదయము దాఁకెం బయిపయి
చూపుల నేమని చూచితివో
కోపము కన్నులఁ గురిసి మోమున
నేపునఁ జిఱునగ వెడయదు నాకు

చ. 3:

ఆఁగిన కుచముల నలసారఁగ నా
కౌఁగిట నేమని కలసితివో
రాఁగవు వేంకట రమణుని చెమటలఁ
దోఁగియు వేడుక దొలగదు నాకు