పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0053-6 శ్రీరాగం సంపుటం: 06-072

పల్లవి:

తెలియ దెవ్వరికిని దేవదేవేశ యీ
నెలఁత భావం బెల్ల నీవెఱుఁగు దిఁకనూ

చ. 1:

నిలుచుఁ దలయూఁచుఁ గన్నీరు వాలిక గోళ్లఁ
జినుకు నివ్వెఱఁగుపడుఁ జింతించును
పులకించు నలయుఁ దలపోయు నినుఁ జిత్తమున
నిలువునంగన విధము నీ వెఱుఁగు దిఁకను

చ. 2:

కమలంబు చెక్కుతోఁ గదియించు నెన్నుదుట
చెమటఁ బయ్యెదఁ దుడుచు సెలవినగును
తమకంపుఁగోరికలు తరుణి యిదె నినుఁబాసి
నిమిష మోర్వఁగలేదు నీ వెఱుఁగు దిఁకను

చ. 3:

వెక్కసపు నునుదురుము వెడవదల నేరదు
చిక్కుదేరఁగఁ గొంతసిగ్గు వడును
ఇక్కువలఁ దిరువేంకటేశ నినుఁ గూడె నిదె
నిక్కమీ చెలివగల నీవెఱుఁగు దిఁకనూ