పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0052-5 శ్రీరాగం సంపుటం: 06-065

పల్లవి:

చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ
మరగె నిన్నలమేల్మంగ నాచారి

చ. 1:

నిలువుఁదురుము మీఁది నెమలిపాదపుడాలు
తొలి మెఱుంగుల మించి దొలఁకఁగాను
అలరుచు నినుఁ జూచి అప్పుడె వెరగువడి
మలయుచు నలమేలుమంగ నాచారి

చ. 2:

పరగునీమెడ సరపణులవుయ్యాలలో
ఉరుటు మురిపమున నూఁగుచును
గిరికొన్న తమకాన కిందుమిఁదెఱుఁగక
మరచె మే నలమేలు మంగనాచారి

చ. 3:

కంచము గని మోవి కమ్మఁదేనే లారగించి
లంచముగఁ గస్తూరి లప్పలు రాల
యెంచఁగఁ దిరువేంకటేశుఁడు నీ పాఁపసజ్జ
మంచమెక్కె నలమేల్మంగనాచారి