పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0042-5 సామంతం సంపుటం: 06-005

పల్లవి:

అల్లవాఁడెవో అతివరో కడు
పెల్లెన ముత్యాల పేరులవాఁడు

చ. 1:

తెప్పమీద నున్న వాఁడు తెల్లని కన్నులవాఁడు
దుప్పటి కంకుమనీటఁ దొప్పందోఁగినాడు
పుప్పొడి మేనెల్లనిండఁ బూవులవేట్లాడి
కప్పురగందులనెల్లం గరఁగించినాఁడు

చ. 2:

క్రుమ్ముడి జారిన వాఁడు కోమలి చిమ్మనం గ్రోవి
చిమ్మెడి పన్నీట మోము చెమరించువాఁడు
కమ్మని కస్తూరి బొట్టు కరఁగిచెదర కను
దమ్ముల నలుపు చూపు దైవాఱువాఁడు

చ. 3:

మంచి మంచి మణులు దాపించిన గద్దియ మీఁద
అంచగమనలుం దాను నాట చూచువాఁడు
మించిన కోనేటివాఁడు మెరసి వైభవముల
నెంచంగల తిరువేంకటేశుండనువాఁడు