పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0042-4 కాంబోజి సంపుటం: 06-004

పల్లవి:

ఆరగింపవో మాయప్ప యివే
పేరిన నేతులు పెరుగులును

చ. 1:

తేనెలు జున్నులు తెంకాయ పాలును
ఆనవాలు వెన్నట్లును
నూనె బూరెలును నురుగులు వడలును
పానకములు బహు ఫలములును

చ. 2:

పరమాన్నంబులు పంచదారలును
అరిసెలు గారెలు నవుగులును
కరజికాయలును ఖండమండెఁగలు
పరి పరి విధముల భక్ష్యములు

చ. 3:

కడు మధురంబగు కమ్మఁబూరణపుఁ
గుడుములు నిడ్డెన కుడుములును
సుడిగొనునప్పాలు సుకినప్పాలును
పొడి బెల్లముతోఁ బొరఁటుచును

చ. 4:

కాయపు రుచులకు గనియగు మిరియపుఁ
గాయలు నేలకి కాయలును
పాయరానియంబాళపుఁగాయలు
నాయతమగు దధ్యన్నములు

చ. 5:

ఒడికపుఁ గూరలు నొలుపుఁబప్పులును
అడియాలపు రాజాన్నములు
బడిబడిఁ గనకపుఁ బళ్లెరములతోఁ
గడు వేడుక వేంకటరమణా